ప్రిస్క్రిప్షన్ లేకుండా సిరప్ మందుల విక్రయాలకు చెక్

న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో ఇకపై కఫ్ సిరప్‌లతో పాటు అన్ని రకాల సిరప్ ఆధారిత ఔషధాలను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
‘డ్రగ్స్ (ఐదవ సవరణ) నిబంధనలు-2026’ కింద డ్రగ్స్ రూల్స్, 1945లోని షెడ్యూల్-కే నుంచి “సిరప్స్” అనే పదాన్ని తొలగించారు. దీంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో అమలులో ఉన్న మినహాయింపులు రద్దయ్యాయి. ఇకపై దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన ఫార్మసీల్లో మాత్రమే, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ) జారీ చేసిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే సిరప్ మందులను విక్రయించాల్సి ఉంటుంది.
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) విధానంలో కఫ్, జలుబు, జ్వరం తదితర సమస్యలకు వినియోగించే సిరప్‌ల విక్రయాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో అమల్లో ఉన్న సడలింపులు కూడా ఈ తాజా సవరణతో తొలగిపోయాయి.
సిరప్ మందుల దుర్వినియోగం, స్వీయ వైద్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కలుషిత సిరప్‌ల కారణంగా గతంలో చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడం, మరణాలు సంభవించడం వంటి ఘటనలు ఆందోళన కలిగించాయని తెలిపింది. ఔషధాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ, విక్రయాల రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని వివరించింది.
ఈ నూతన నిబంధనలు అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు సిరప్ మందులు కొనుగోలు చేసే సమయంలో వైద్యుడు సూచించిన ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
