ఆన్లైన్ ఫార్మసీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులపై డీసీఏ ప్రత్యేక దాడులు.. 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ఫార్మసీలకు అనుబంధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 మరియు సంబంధిత నిబంధనల అమలును పరిశీలించేందుకు ఈ దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 166 మెడికల్ షాపులను పరిశీలించారు. వీటిలో 159 దుకాణాలు ఆన్లైన్ మందుల డెలివరీ సేవలకు, మరో 7 దుకాణాలు ఆన్లైన్ బీ2బీ (B2B) ప్లాట్‌ఫారమ్‌లకు అనుబంధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ముఖ్యంగా..
- విక్రయ బిల్లులను సక్రమంగా నిర్వహించకపోవడం,
- ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు, షెడ్యూల్-హెచ్1 రిజిస్టర్లను నిర్వహించకపోవడం,
- కొనుగోలు ఇన్వాయిస్లను సమర్పించకపోవడం,
- చెల్లుబాటు అయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను విక్రయించడం,
- రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందులు అందించడం,
- రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలను అధికారులు గుర్తించారు.
ఈ ఉల్లంఘనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 41 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీసీఏ వెల్లడించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.
ఆన్లైన్ ఫార్మసీ ప్లాట్‌ఫారమ్‌లకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు సహా అన్ని ఔషధ దుకాణాలు చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీసీఏ హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ప్రజారోగ్య పరిరక్షణ, బాధ్యతాయుతమైన ఔషధాల పంపిణీ, ఫార్మాస్యూటికల్ రంగంలో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇటువంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని డీసీఏ పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
