నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు: ఎన్టీఏ

న్యూఢిల్లీ, జూన్ 16(Zindagi9news): నీట్ (యూజీ)-2026 రీ-పరీక్ష నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీక్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు టెలిగ్రామ్ వేదికపై తాత్కాలిక పరిమితులు విధించిన చర్యలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్వాగతించింది. ఈ మేరకు సోమవారం ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది.
ఎన్టీఏ సిఫారసుల మేరకు సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్ 69ఏ కింద టెలిగ్రామ్ సేవలకు భారతదేశంలో జూన్ 22 వరకు పరిమితులు విధించినట్లు పేర్కొంది. అలాగే ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే (మెసేజ్ ఎడిటింగ్) సదుపాయాన్ని జూన్ 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
నీట్ (యూజీ)-2026 రీ-పరీక్ష జూన్ 21న జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను మోసం చేసేందుకు కొన్ని ముఠాలు టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రశ్నాపత్రాలు అందిస్తామని ప్రచారం చేస్తున్నాయని ఎన్టీఏ వెల్లడించింది. ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా, పరీక్షలను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), రాష్ట్ర పోలీసు శాఖలు, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఇప్పటికే అనేక టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు, బాట్లపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
‘పేపర్ లీక్ నీట్’, ‘రీ-నీట్ 2026’, ‘ప్రైవేట్ మాఫియా’, ‘ఫ్రీ నీట్ మాఫియా’ వంటి పేర్లతో కొన్ని ఛానళ్లు విద్యార్థులు, వారి కుటుంబాల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయని ఎన్టీఏ పేర్కొంది. అయితే భద్రతా వ్యవస్థ వెలుపల ఎలాంటి ప్రశ్నాపత్రం అందుబాటులో ఉండదని, అలాంటి హామీలు పూర్తిగా మోసపూరితమైనవేనని స్పష్టం చేసింది.
అలాగే టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను ఉపయోగించి పరీక్ష అనంతరం అసలు ప్రశ్నాపత్రాలను పాత సందేశాల్లో జతచేసి, అవి ముందుగానే లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని ఎన్టీఏ వెల్లడించింది. ఈ తరహా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికే మెసేజ్ ఎడిటింగ్ సదుపాయంపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.
ప్రశ్నాపత్రాల లీక్ పేరుతో వచ్చే ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దని, మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ సూచించింది.
