27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలు
పాడి రైతులకు అండగా ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 20(Zindagi9news): రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డెయిరీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ ద్వారా పాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాస్తవ పాల ఉత్పత్తి, పశువుల సంఖ్యపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాడి రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, సంక్షేమ శాఖల ద్వారా నేరుగా ఆయా విభాగాలకే నిధులు బదిలీ చేసే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆధునిక పద్ధతుల ద్వారా తెలంగాణలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చి, వ్యవసాయంతో పాటు రైతులకు అదనపు జీవనోపాధి, ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
