నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

హైదరాబాద్, జూన్ 19(Zindagi9news): ఈ నెల 21న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తెలిపారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి, ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఏసీ సర్వీసులు మినహా అన్ని టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.
ఈ పరీక్షకు సుమారు 73 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల మార్గాల్లో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జూన్ 21 తొలి సర్వీసు నుంచి అర్ధరాత్రి (00.00 గంటల) వరకు ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రయాణానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే 040-2345 0033, 6815 3333 నంబర్లలో టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ముందుగానే ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించిన వీసీ అండ్ ఎండీ నాగిరెడ్డి, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
