జూన్ 25 నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ
అర్హులందరి పేర్లు నమోదు.. అనర్హుల తొలగింపే లక్ష్యం : సీఈఓ సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 20(Zindagi9news): అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు అనర్హులైన వారి పేర్లను తొలగించాలనే ఉద్దేశ్యంతోనే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం బీఆర్కే భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి గణన ఫారమ్‌లు (Enumeration Forms) పంపిణీ చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులపాటు గణన ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, ఈ గడువుకు ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. బీఎల్ఓలు ఓటర్లకు గణన ఫారమ్‌లను పూరించడంలో సహాయం చేస్తారని, ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ అందించామని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఫారమ్‌ల పంపిణీతో పాటు పూరించిన ఫారమ్‌లను సేకరిస్తారని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తారని, బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలకు సహకరించేందుకు తగిన శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. ఓటర్లు తమ గణన ఫారమ్‌లను voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని చెప్పారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. గణన ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కోసం బీఎల్ఓలు ఇంటింటికీ వచ్చినప్పుడు ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఏఎస్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం. సత్యవాణి, ఐఏఎస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి ఎ.ఎస్. చారి, బి. చెన్నయ్య (ఎస్జీడీసీ) తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
