జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు మినహాయింపు కల్పించాలి
జిల్లా కలెక్టర్‌కు టిడబ్ల్యూజేఎఫ్ వినతి

కరీంనగర్, జూన్ 15(Zindagi9news): జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు మినహాయింపు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆర్థిక పరిస్థితులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పాఠశాల ఫీజుల్లో ప్రత్యేక రాయితీ కల్పించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు బాపురావు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అధిక శాతం జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 80 శాతం మంది జర్నలిస్టులకు స్థిరమైన నెలవారీ ఆదాయం లేకపోవడంతో తమ పిల్లల విద్యాభారం మోయలేక, కుటుంబ పోషణలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల కారణంగా జర్నలిస్టుల పిల్లల చదువులు భారంగా మారాయని పేర్కొంటూ, అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు మినహాయింపు కల్పించాలని కోరారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నిర్ణయం అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో లేదా సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పి.ఎస్. రవీంద్ర, టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంతాటి రవీందర్, భూపతి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము గణేష్, లక్కం సురేష్, కార్యదర్శులు కిరణ్, ఎండి ఖాజా, నాయకులు సుదర్శన్ రెడ్డి, అనిల్, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు యోహాన్, దీక్షిత్, గౌతమ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
