ఎన్నికల్లో ఓడిన అంగన్వాడీ సిబ్బందికి ఊరట.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు
అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పునర్నియామకానికి మార్గం సుగమం

హైదరాబాద్, జూన్ 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, అనంతరం ఓటమి చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఇప్పటికే నియమించనట్లయితే, గతంలో అమల్లో ఉన్న ఉత్తర్వుల మేరకు తిరిగి సేవల్లోకి తీసుకోవాలని మహిళా, శిశు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన వినతులు, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పునర్నియామక అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించాలని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కోరింది.
అయితే, ఆయా పోస్టుల్లో ఇప్పటికే ఇతర అభ్యర్థులు ఎంపికై ఉంటే ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు.
