బుల్లెట్ రైలు, వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
మౌలిక వసతుల అభివృద్ధికి వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌తో పాటు వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, టీజీఐఐసీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి, హైదరాబాద్–పుణే రైల్వే మార్గంలో వికారాబాద్‌లోని అనంతగిరి సమీపంలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతగిరి ప్రాంతం నుంచి ఐటీ హబ్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
అలాగే, ప్రతిపాదిత ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి అనుసంధానంగా హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్వే లైన్లో ప్రత్యేక స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రైల్వే లైన్ల రూపకల్పన జరగాలని పేర్కొన్న సీఎం, మన్ననూర్ సమీపంలో ‘నల్లమల స్టేషన్’, సోమశిల ప్రాంతం వద్ద మరో స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ను దేశంలోని ప్రధాన బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణ, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
