
జమ్మికుంట, జూన్ 17(Zindagi9news):జమ్మికుంట మండల పరిధిలోని తనుగుల గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న ఇసుక కుప్పలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జమ్మికుంట తహశీల్దార్ తెలిపారు. మొత్తం 120 ట్రాక్టర్ల ఇసుకను ఒకే లాట్‌గా వేలం వేయనున్నారు.
జూన్ 18, 2026 (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో ఈ బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ట్రాక్టరుకు రూ.1,800 చొప్పున మొత్తం ఇసుక విలువ రూ.2,16,000గా నిర్ణయించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.50,000 ధరఖాస్తు సొమ్ము (ఈఎండీ)ను జూన్ 18 మధ్యాహ్నం ఒంటి గంటలోపు తహశీల్దార్ కార్యాలయంలో నగదు రూపంలో చెల్లించి రశీదు పొందాలని అధికారులు సూచించారు.
వేలంలో అత్యధిక ధరకు పాట పాడుకున్న వ్యక్తి మిగిలిన పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, పాట దక్కని వారికి వారి డిపాజిట్ సొమ్మును వెంటనే తిరిగి అందజేస్తామని తహశీల్దార్ వెల్లడించారు. ఇసుక నిల్వలను ముందుగానే పరిశీలించాలనుకునే వారు తనుగుల గ్రామ వీఆర్వోను 9908395534 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.
