చెరువులా తలపిస్తున్న పెబ్బేరు మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఆవరణం

పెబ్బేరు: రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం పరిష్కారం కాని దిశగా సాగుతున్నాయి. వర్షాకాలం రాగానే పెబ్బేరు మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఆవరణం చెరువులా మారిపోతుంది. ప్రధాన గేటు దగ్గర నిలిచిపోయే వర్షపు నీటితో విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులలోకి ప్రవేశించడమే కాక ఆడుకోవడంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ పాఠశాలలో మోడల్ స్కూల్లో 495 మంది, జూనియర్ కళాశాలలో 235 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే సర్వీస్ రోడ్ లేకపోవడంతో ప్రతిరోజూ విద్యార్థులు రాంగ్ రూట్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం పడితే స్కూల్ ప్రాంగణం అంతా నీటితో నిండిపోవడం విద్యార్థులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బాలికలు, మహిళ ఉపాధ్యాయులు ఆవరణలో నిలిచిన నీళ్ల వల్ల తరగతుల వరకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
“వర్షం పడితే గేటు దగ్గర నీళ్లు నిండిపోతాయి. తరగతి గదుల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చిన్న గేట్ ద్వారా వెళ్లాల్సి వస్తోంది” అని 7వ తరగతి విద్యార్థిని దివ్యంతి తెలిపారు.
“ఆవరణంలో నీళ్లు నిలవడంతో ఆటలు ఆడుకోవడానికి కూడా ఇబ్బందిగా మారింది. మహిళా ఉపాధ్యాయులు, బాలికలు చాలా ఇబ్బంది పడుతున్నారు” అని 8వ తరగతి విద్యార్థిని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉన్నప్పటికీ, పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టకపోవడం తల్లిదండ్రులు ఆగ్రహానికి గురిచేస్తోంది. నీటి నిల్వతో దుర్వాసన, పరిసరాల కాలుష్యం పెరుగుతుండడంతో విద్యార్థుల ఆరోగ్యానికీ ప్రమాదం పొంచి ఉంది.
👉 ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లేకపోవడం విశేషం. బడుగు పిల్లల చదువుకు సంబంధించిన సమస్యలు పాలకులకు పట్టనట్టే ఉందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
