తెలంగాణలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ అందుబాటులోకి
తహసీల్దార్ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల్లో పొందే అవకాశం
కుటుంబ సభ్యుల వివరాలు అవసరమైన సందర్భాల్లో ఉపయోగపడుతుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూలై 31 (Zindagi9News): తెలంగాణ ప్రజలకు తమ కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా సమర్పించాల్సిన సందర్భాల్లో ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ను అందుబాటులోకి తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్టిఫికెట్ను తహసీల్దార్ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చని వెల్లడించారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో నిర్వహించిన SIR అవగాహన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం తదితర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సభ్యుల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని, ఏ కుటుంబానికైనా తమ కుటుంబ సభ్యుల వివరాలు అవసరమైతే తహసీల్దార్ కార్యాలయం లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందవచ్చని తెలిపారు.
ప్రభుత్వ శాఖలు లేదా ఇతర వ్యవస్థలు కుటుంబ వివరాలను కోరిన సందర్భంలో ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క వివరించారు.
