
ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి చెరగని ముద్ర : వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ : సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ మరిన్ని సినిమాలు తీసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆయనకు మరింత మంచి పేరు, గౌరవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
చిరంజీవి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్లో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో 400 మంది మెగా అభిమానులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దేవక్కపల్లిలో వాహనాల ర్యాలీని వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉందని, కుటుంబానికి అత్యంత ఆప్తుడని గుర్తు చేశారు. గతంలో చిరంజీవి ఐదు రోజులపాటు తమ ఇంట్లో కరీంనగర్లో ఉండడం గుర్తుచేశారు. ఆయన విలక్షణమైన నటనతో ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించారని తెలిపారు.
మెగా అభిమానులు, చిరంజీవి యువత ప్రతినిధులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు తరలి వెళ్ళడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్, ఆకుల నరసన్న, ఆకుల ఉదయ్ బట్టు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
