కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటకు జాతీయ స్థాయి గుర్తింపు

వ్యవసాయ సాంకేతిక అనువర్తన పరిశోధన సంస్థ (ATARI), హైదరాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు తమిళనాడులోని వెల్లూరులో నిర్వహించిన వార్షిక సమీక్ష సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK) జమ్మికుంట ఘనత సాధించింది. జోన్-X పరిధిలోని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన 72 కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొన్న ఈ సమీక్షలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం జోనల్ స్థాయిలో మూడవ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది.
కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు ఈ అవార్డును డాక్టర్ షేక్.ఎన్. మీరా (డైరెక్టర్, అటారీ, జోన్-X) , డాక్టర్ భారతి హరిశంకర్ (వైస్ ఛాన్సలర్, అవినాశలింగం విశ్వవిద్యాలయం, తమిళనాడు) చేతుల మీదుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ప్రధాన కార్యదర్శి విజయ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు శాస్త్రవేత్తల బాధ్యతను మరింత పెంచిందని, జిల్లా రైతాంగానికి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
