
హైదరాబాద్లో దారుణం
గర్భవతి భార్యను ముక్కలుగా నరికి మూసీలో పడేసిన భర్త
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్లో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భంతో ఉన్న భార్య స్వాతి (22)ని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా హత్య చేశాడు.
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన స్వాతి యాదవ్, అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది. దంపతులు 25 రోజుల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటున్నారు.
కుటుంబ సమస్యల కారణంగా మహేందర్ రెడ్డి తన భార్యను రంపంతో నరికి ముక్కలు ముక్కలుగా చేసి, వాటిని కవర్లలో వేసి మూసీ నదిలో పడేశాడు. శరీరంలోని ఛాతీ భాగం మాత్రం ఇంట్లోనే ఉండడం చూసి పోలీసులు షాక్కు గురయ్యారు.
స్థానికుల అనుమానం మరియు బంధువుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మిగతా శరీర భాగాలు కోసం మూసీలో విస్తృతంగా శోధిస్తున్నారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
