
ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర వాటా కోసం ఎదురుచూపులు – మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మే 16 (Zindagi9News): రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం మార్చి నెల నుంచి ఎదురుచూస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఒక్కో ఇంటికి కేంద్ర వాటాగా సుమారు రూ.1.13 లక్షలు రావాల్సి ఉందని, ఆ నిధులు వస్తాయన్న ఆశతో లబ్ధిదారుల ఫైనల్ బిల్లులను తాత్కాలికంగా నిలిపివేశామని వెల్లడించారు.
శనివారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్రం నుంచి నిధులు రాకపోయినా మరో 15–20 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తూ లబ్ధిదారులకు డబ్బులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తొలి విడతగా మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటికే సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నెలాఖరుకల్లా మరో 68–72 వేల ఇండ్లు శ్లాబ్ దశకు చేరుకుంటాయని తెలిపారు.
జూన్ 2న రెండో విడత ప్రారంభం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. గోడలు, బేస్మెంట్ లేదా శ్లాబ్ దశలో ఉన్న ఇళ్లకూ ఈ విడతలో అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశంపై ఈ నెల 21న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
భూముల విలువల సవరణ నెలాఖరులోగా
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల్లో ఉన్న అసమానతలను సరిచేసేందుకు ఈ నెలాఖరులోగా భూముల విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించి అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో అశాస్త్రీయంగా పెంచిన ధరలను సమీక్షించి కొత్త విధానం తీసుకొస్తున్నామని చెప్పారు.
2BHK ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన 2BHK ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన నిర్మాణ పనులను లబ్ధిదారుల చేతనే పూర్తి చేయించే విధానాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
రెవెన్యూ-ఫారెస్ట్ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెవెన్యూ-ఫారెస్ట్ భూ సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టి రోవర్ సాంకేతికతతో సరిహద్దులను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్ర సర్వే నిర్వహిస్తామని తెలిపారు.
