కొడుకును పోలీసులకు అప్పగించిన బండి సంజయ్.. ‘చట్టం ముందు అందరూ సమానమే’”

చట్టానికి గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించాం: బండి సంజయ్
హైదరాబాద్, మే 16(Zindagi9News): తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
“చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే” అని బండి సంజయ్ పేర్కొన్నారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని, ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని భావించినట్లు తెలిపారు.
అయితే న్యాయ సలహా కోసం అడ్వోకేట్లను సంప్రదించామని, తమ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించిన లాయర్లు కేసు కొట్టివేయబడే అవకాశం ఉందని, బెయిల్ కూడా వస్తుందని చెప్పడంతో కొంత జాప్యం జరిగిందని వెల్లడించారు.
ఇప్పటికీ బెయిల్ వచ్చే అవకాశముందని లాయర్లు చెబుతున్నప్పటికీ, మరింత ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఈరోజు తమ కుమారుడిని లాయర్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించినట్లు తెలిపారు.
న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ చట్టంపై గౌరవంతో విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
