కరీంనగర్లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

కరీంనగర్, మే 18 (జిందగీ9న్యూస్): కరీంనగర్ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో పాటు వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ మరియు లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా వేగవంతంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా, 314 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే దాదాపు అంతే పరిమాణంలో ధాన్యం చేరినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, మిగిలిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి 63 శాతం చెల్లింపులు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో రూ.237.39 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం రవాణా వేగవంతం చేసేందుకు రైస్ మిల్లర్లు, లారీ యజమానులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అవసరానికి అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని, రైతులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పీఏసీఎస్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
