
వెలిచాల రాజేందర్రావుకు పూర్తి బాధ్యతలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేతల వినతి
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డికి కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, సర్పంచులు మరియు పలువురు ముఖ్య నాయకులు వినతి పత్రం అందజేశారు.
మంగళవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి రాజేందర్రావుకు పూర్తి స్వేచ్ఛతో బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇతర నేతల జోక్యం లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లగలరని పేర్కొన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత పటిష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, సర్పంచులు, మైనార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
