
బండి భగీరథ్ పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 15: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “చేసిన తప్పు నుంచి బండి భగీరథ్ తప్పించుకోలేడు. నేరస్థుడు ఎవరైనా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే” అని సీఎం పేర్కొన్నారు.
సీఎం వివరాల ప్రకారం, ఈ నెల 8న బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రధాని పర్యటన బందోబస్తు కారణంగా ఆలస్యం జరిగిందని, 11న మైనర్ బాలిక నుంచి స్టేట్మెంట్ నమోదు చేసిన తర్వాతే పోక్సో కేసు నమోదు చేశామని వెల్లడించారు.
“తల్లి ఫిర్యాదుకంటే మైనర్ బాలిక స్టేట్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చాం. అమ్మాయి వాంగ్మూలం ఆధారంగానే కేసు నమోదు చేశాం. కేసు విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు” అని సీఎం స్పష్టం చేశారు.
అలాగే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, “కొడుకుపై కేసు నమోదైతే తండ్రిని అరెస్ట్ చేయాలా?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు.
బాధిత బాలికకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నామని, ఆధారాలు దొరికితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఎం తెలిపారు. “బండి సంజయ్ కాదు.. ఎవరైనా సరే బాధితులకు న్యాయం చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక, బండి సంజయ్ తన కుమారుడిని స్వయంగా విచారణకు హాజరుపరచాలని సూచించిన సీఎం, “కీలక హోదాలో ఉన్న వ్యక్తిగా హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం పోక్సో కేసు విచారణ కొనసాగుతోందని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
