
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రికార్డ్ అసిస్టెంట్
హైదరాబాద్, మే 25: అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ హైస్కూల్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం, అమీర్‌పేట్ మండలంలోని ప్రభుత్వ హైస్కూల్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్. శివానంద్ ఒక ఫిర్యాదుదారుడి తల్లి పెన్షన్ బెనిఫిట్ ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 యూనిట్ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లంచం స్వీకరించడం ద్వారా విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు ఏసీబీ పేర్కొంది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
