వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. ప్రియుడితో కలిసి మృతదేహం పూడ్చిపెట్టిన భార్య

సంగారెడ్డి, మే 25: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన సంచలనం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి (36) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండేవాడు. అతని భార్య కల్పనకు ఎల్గోయి గైని పండరి అలియాస్ చింటూతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 16వ తేదీన భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో కల్పన తన ప్రియుడి సహాయంతో ముత్యంరెడ్డిని హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం, చనిపోయిన తన సోదరుడికి సమాధి నిర్మించాల్సి ఉందని చెప్పి జేసీబీ సహాయంతో గ్రామ శివారులోని పొలంలో గుంత తవ్వించి, మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం ఈ నెల 18న భర్త కనిపించడం లేదంటూ కల్పనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు విచారణలో అనుమానం రావడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.
దీంతో పోలీసులు ఘటన జరిగిన 9 రోజుల అనంతరం మృతదేహాన్ని వెలికితీసి, నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
