రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఈఈ

వరంగల్, మే 25: వరంగల్ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (I&CAD) శాఖలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.
ఏసీబీ వివరాల ప్రకారం, గంటి శ్రీకాంత్, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE), ఫిర్యాదుదారుడు నిర్మించిన 10 డబుల్ బెడ్రూమ్ (2BHK) ఇళ్లకు సంబంధించిన ఫైనల్ మెజర్మెంట్స్ను M-బుక్స్‌లో నమోదు చేసి, బిల్లులను ప్రాసెస్ చేయడానికి రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ బిల్లులను సెప్టెంబర్ 2022 నుంచి పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం (మే 25) హనుమకొండలోని భవాని నగర్లో ఉన్న తన నివాసంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, వరంగల్‌లోని ప్రత్యేక SPE & ACB కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
