
“ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా” నినాదంతో జూన్ 26న భూపాలపల్లిలో భారీ సభ
టేకుమట్ల, జూన్ 9(Zindagi9news): ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో BC, SC, ST-JAC ఆధ్వర్యంలో ఈ నెల 26న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న “సామాజిక న్యాయం – రాజ్యాధికారం” భారీ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను టేకుమట్ల మండల కేంద్రంలో మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా BC, SC, ST-JAC భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, టేకుమట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, బూర్నపల్లి సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్, ఆరెపల్లి సర్పంచ్ గుర్రం మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం వెనుకబడిన వర్గాల జీవితాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ, పూర్తి స్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత ఇంకా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. జనాభా నిష్పత్తి మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశాలు, వాటా, రాజ్యాధికారం కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాల్లో భాగంగా జూన్ 26న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో BC, SC, ST-JAC జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, సంగ రాజేందర్, పుల్ల అశోక్, శీలపాక నాగరాజు, దాసారపు భాస్కర్, చిలుముల కృష్ణ, శశికుమార్, పర్లపల్లి వంశీ, మారేపల్లి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
