ప్లాట్ రిజిస్ట్రేషన్‌లో సర్వే నంబర్ గందరగోళం.. నలుగురిపై కేసు
జమ్మికుంట, జూన్ 9(Zindagi9news): ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాల్లో లేఅవుట్‌కు సంబంధం లేని సర్వే నంబర్ నమోదు కావడంతో బ్యాంకు రుణం తిరస్కరణకు గురైన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా, నలుగురిపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు టౌన్షిప్లో ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. అయితే, లేఅవుట్‌కు సంబంధించిన అసలు సర్వే నంబర్లకు అదనంగా సంబంధం లేని సర్వే నంబర్ 103ను రిజిస్ట్రేషన్ పత్రాల్లో నమోదు చేసినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో సదరు వ్యక్తి రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, డాక్యుమెంట్లలో ఉన్న సర్వే నంబర్ వ్యత్యాసాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు రుణాన్ని తిరస్కరించారు. దీంతో ప్లాట్ విక్రయించిన వారిని సంప్రదించగా, డాక్యుమెంట్లో సవరణ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డాక్యుమెంట్లలోని తప్పిదం కారణంగా తాను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో, సంబంధిత నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
