హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
జూన్ 15లోగా CCTNS 2.0, ఈ-సాక్ష్యలో వివరాల నమోదు పూర్తి చేయాలని ఆదేశం

హుజురాబాద్, జూన్ 9(Zindagi9news): వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ కేసులు, రికార్డులను సమీక్షించారు. కార్యాలయానికి చేరుకున్న సీపీకి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించగా, అనంతరం ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.
సమీక్ష సందర్భంగా పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని సీపీ సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య వ్యవస్థల్లో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15లోగా నమోదు చేయాలని ఆదేశించారు. పాత పెండింగ్ కేసులతో పాటు కొత్తగా నమోదయ్యే కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, ఆధారాల సేకరణలో ఈ-సాక్ష్య యాప్‌ను సమర్థంగా వినియోగించాలని సూచించారు.
గత నెలలో కరీంనగర్‌లోని పీఎంజే నగల షోరూంలో జరిగిన దోపిడీ ఘటన నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను పరిశీలించి, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో నిబంధనలు అమలు చేస్తున్నామని, లోపాలు గుర్తించిన యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇతర రాష్ట్రాలు, నేపాల్ నుంచి వచ్చిన వలస కార్మికుల వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదు చేస్తున్నామని సీపీ తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, వాహన తనిఖీలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. పాత నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా అనుమానితులకు పరీక్షలు నిర్వహించి, పట్టుబడిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ‘షీ లీడ్స్’, ‘స్నేహిత’ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, పనిచేయని సీసీ కెమెరాలను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
తనిఖీల సందర్భంగా హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణపై సీపీ గౌష్ ఆలం సంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. సమీక్షలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, ఆవుల తిరుపతి తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

