సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం.. గన్‌పార్క్ వద్ద అరెస్టులు
డిమాండ్ల సాధనకు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్’
జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మామిడి సోమయ్య విమర్శ

హైదరాబాద్, జూన్ 18(Zindagi9news): జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గన్‌పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు గన్‌పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించి, వినతిపత్రాన్ని సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో పాలకులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రంలోని అనేక చిన్న, మధ్య తరహా పత్రికలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, రెండున్నర సంవత్సరాలుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంతో మీడియా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే జర్నలిస్టులకు ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయడం, ఆర్ఎన్ఐ, పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన పత్రికలను ఎంపానెల్మెంట్ చేయడం, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, ఉచిత బీమా పథకం, 60 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు పెన్షన్లు, సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించడం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.
నిరసన అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని పంజాగుట్ట, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలకు సిద్ధమవుతామని మామిడి సోమయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
