హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 41 అంశాలకు ఆమోదం
నూతన కౌన్సిల్ హాల్, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు – బక్రీద్ ఏర్పాట్లు, ఫాగింగ్ మెషిన్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

హుజురాబాద్, మే 27(zindagi9news) : హుజురాబాద్ పురపాలక సంఘంలో బుధవారం చైర్పర్సన్ సుహాసినీ రొంటాల అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మొత్తం 41 అంశాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. పురపాలక సంఘ కార్యాలయ భవనం పై నూతన కౌన్సిల్ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధుల మంజూరీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
అలాగే పట్టణంలోని 30 వార్డుల్లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.2.50 కోట్ల నిధుల మంజూరీ నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ప్రధాన రహదారుల మధ్యనున్న సెంట్రల్ మీడియన్లలో విద్యుత్ దీపాల మరమ్మతుల కోసం సాధారణ నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. బక్రీద్-2026 సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూ.2 లక్షలతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
దోమల నివారణ చర్యల్లో భాగంగా సాధారణ నిధుల నుంచి రూ.1.49 లక్షలతో రెండు కొత్త ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని కౌన్సిల్ ఆమోదించింది. అలాగే పట్టణంలో తాగునీటి సరఫరా నిర్వహిస్తున్న జోన్-1, జోన్-2 ట్రంక్ మెయిన్ పైప్లైన్లలో తరచూ ఏర్పడుతున్న లీకేజీల నివారణకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.5 లక్షలతో ఎయిర్ వాల్వ్‌లు బిగించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో చైర్పర్సన్ సుహాసినీ రొంటాల, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి. కిషన్, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, టెక్నికల్ అధికారి నరేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశ్వినీ గాంధీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఐ. రమేష్, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, వ్యవస్థాపన విభాగాధికారి పి. శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
