ఇల్లందకుంట మండలంలో దారుణం.. కత్తిపోట్లలో తండ్రి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు

ఇల్లందకుంట, మే 27(Zindagi9news): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో పొరుగువారి మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీయగా, ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపల్లి గ్రామానికి చెందిన నందికొండ లావణ్య కుటుంబానికి, వారి పొరుగువారైన చల్లూరి చంటి అలియాస్ మధు, చల్లూరి వసంత, చల్లూరి నర్సయ్యలతో గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో నందికొండ రాజు, అతని కుమారుడు నిషాంత్ వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌పై పొలాలకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో నిందితులు చల్లూరి చంటి, వసంత, నర్సయ్యలు ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘర్షణలో నిందితుడు చల్లూరి చంటి కత్తితో నిషాంత్ కడుపులో పొడిచాడు. గమనించి కుమారుడిని రక్షించేందుకు వచ్చిన తండ్రి రాజుపై కూడా నిందితులు విచక్షణారహితంగా దాడి చేశారు. చంటి కత్తితో బలంగా పొడవడంతో రాజు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న రాజును కుటుంబ సభ్యులు వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కుమారుడు నిషాంత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతుని భార్య నందికొండ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
