
- బక్రీద్ పండుగ వేళ గొర్రెలు, మేకల అమ్మకందారులకు హెచ్చరిక.. ఫేక్ ఫోన్‌పే మోసాలపై జాగ్రత్త!
హైదరాబాద్, మే 26:
బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలోని గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇదే అవకాశంగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు డిజిటల్ పేమెంట్ల పేరిట వ్యాపారులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫేక్ ఫోన్‌పే వంటి నకిలీ మొబైల్ యాప్‌లను ఉపయోగించి నగదు చెల్లించినట్లు చూపిస్తూ అమాయక వ్యాపారులకు టోకరా వేస్తున్నారు.
సంతల్లో ఉండే హడావుడిని ఆసరాగా చేసుకుని, కొనుగోలుదారులు తమ మొబైల్లో “పేమెంట్ సక్సెస్” స్క్రీన్ చూపించి, డబ్బులు జమ అయినట్లు నమ్మిస్తున్నారు. అయితే, వ్యాపారులు తమ బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోకుండానే గొర్రెలు, మేకలను అప్పగించడం వల్ల మోసపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కంచన్‌బాగ్ మరియు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు మోసాలు చోటుచేసుకున్నాయి. కంచన్‌బాగ్ ప్రాంతంలో ముగ్గురు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఓ వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ.68 వేల చెల్లింపు చేసినట్లు నకిలీ యాప్ స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్లినట్లు తెలిసింది.
అదేవిధంగా రాజేంద్రనగర్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు రూ.48 వేల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి, ఇదే తరహాలో ఫేక్ పేమెంట్ యాప్‌తో మోసగించారు. బాధితులు ఆలస్యంగా బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా డబ్బులు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యాపారులకు పోలీసుల సూచనలు
గొర్రెలు, మేకల అమ్మకందారులు కొనుగోలుదారుడి మొబైల్లో కనిపించే స్క్రీన్‌షాట్ లేదా “పేమెంట్ సక్సెస్” మెసేజ్‌ను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులు జరిగినప్పుడు తప్పనిసరిగా మీ మొబైల్‌కు వచ్చే బ్యాంక్ అధికారిక SMS లేదా మీ బ్యాంకింగ్ యాప్‌లో బ్యాలెన్స్ జమ అయిందో లేదో స్వయంగా పరిశీలించిన తర్వాతే జీవాలను అప్పగించాలని సూచించారు.
అలాగే, వీలైనంత వరకు పెద్ద మొత్తాల లావాదేవీలు నగదు రూపంలో చేయడం సురక్షితం అని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మోసం చేయడానికి ప్రయత్నించినా వెంటనే డయల్ 100 కు కాల్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
