
టేకుమట్లలో గంజాయి తో యువకుడు అరెస్టు
టేకుమట్ల, సెప్టెంబర్ 26 (దేవేందర్ రిపోర్టర్ – జిందగీ నైన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (T) గ్రామ శివారులో పోలీసులు గంజాయి తో ఒక యువకుడిని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఎస్ ఐ దాసరి సుధాకర్ తన సిబ్బందితో పహారా డ్యూటీలో ఉండగా, చిట్యాల వైపు నుండి వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను బొమ్మ రాజేంద్రప్రసాద్ (23), డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి, రామకృష్ణాపూర్ (T) గ్రామానికి చెందినవాడు అని తెలిపారు.
ప్రస్తుతం హన్మకొండలో డిగ్రీ చదువుతున్నానని, అక్కడ స్నేహితుల ద్వారా గంజాయి తాగడం అలవాటు అయ్యిందని, ఆపై గంజాయి అమ్మకాలు కూడా మొదలుపెట్టానని నిందితుడు ఒప్పుకున్నాడు. హైదరాబాద్‌లోని దూలపేట ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి దొరుకుతుందని, అక్కడ కొనుగోలు చేసి ఊరి యువతకు అమ్మాలని ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.
అతని వద్ద నుండి 1.15 కిలోల గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సెప్టెంబర్ 26న రిమాండ్‌కి తరలించారు.
