మురుగునీటితో అంబేద్కర్ కాలనీ రోడ్డు అధ్వానం
పట్టించుకోని పంచాయతీ అధికారులు.. అనారోగ్య భయంతో కాలనీ ప్రజలు

జూలూరుపాడు, సెప్టెంబర్ 17 (Zindagi9News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని అంబేద్కర్ కాలనీలో రహదారి అధ్వానంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న రోడ్డుపై కొంతకాలంగా మురుగునీరు నిలిచిపోవడంతో పాటు రహదారిపై మొక్కలు పెరిగి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.
రోడ్డుకు చాలా కాలంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షాలు, మురుగునీటి కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు, ఇతర కీటకాలు పెరిగి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రానికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉండటంపై కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డును పరిశీలించి, మురుగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అంబేద్కర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కాలనీలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
న్యూస్ రిపోర్టర్: గోలి శ్రీను
ZINDAGI 9 NEWS – JULURUPADU
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
