ఇల్లందకుంట, జూన్ 2 (Zindagi9News):
ఇల్లందకుంట మండలానికి చెందిన వృద్ధ రైతు కొత్తూరి సమ్మయ్య (60) కుటుంబ కలహాల నేపథ్యంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా పక్కింటి వారు గంగారపు ప్రమీల, గంగారపు తిరుపతమ్మ, స్వర్ణలత లతో విభేదాలు ఏర్పడి, తరచూ ఘర్షణలు జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.జూన్ 1న ఉదయం 10:00 గంటల ప్రాంతంలో, సమ్మయ్య తన ఇంటి గోడ నిర్మాణ పనుల్లో ఉండగా, పక్కింటి వారు వచ్చి అడ్డుపడి, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిట్లాడినట్టు సమాచారం. ఈ మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన సమ్మయ్య, ఉదయం 10:50 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లాడు. అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో, కుమారుడు కొత్తూరి రాజకుమార్ వెతికి చూసినప్పుడు, సమ్మయ్య గడ్డి మందు సేవించిన స్థితిలో ఉండటం గమనించారు.వెంటనే సమ్మయ్యను జమ్మికుంట శ్రీ విజయ సాయి హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కు తరలించగా, అక్కడ రాత్రి 10:35 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై మృతుడి భార్య కొత్తూరి ఇలమ్మ జూన్ 2న ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, గంగారపు ప్రమీల, గంగారపు తిరుపతమ్మ, స్వర్ణలత లపై కేసు నమోదు చేసి, ఏఎస్సై సదయ్య దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
