పెబ్బేరు, జూన్ 2 (zindagi9news) : పశువులను కనీస అవసరాలైన మేత, నీరు లేకుండా ఇరుకుగా బంధించి రవాణా చేస్తున్న రెండు వాహనాలను పెబ్బేరు పోలీసులు అదుపులోకి తీసుకొని, సంబంధిత డ్రైవర్లు మరియు యజమానులపై కేసులు నమోదు చేశారు. వాహన తనిఖీల సందర్భంగా ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


సోమవారం మధ్యాహ్నం సుమారు 1:00 గంటల సమయంలో మహేంద్ర బొలెరో వాహనం (TS06UB5194) లో మూడు తెల్ల ఎద్దులను తరలిస్తూ ఉండగా పోలీసులు ఆపి తనిఖీ నిర్వహించారు. డ్రైవరైన డి. మద్దిలేటి (28), పానగల్ మండలం మల్లాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని మాటల ప్రకారం, ఎద్దులు దేవర్ల బుచ్చన్న (48) అనే వ్యాపారికి చెందినవని, నందికొట్కూరు సంతలో కొనుగోలు చేసి మల్లాయపల్లి గ్రామానికి తరలిస్తున్నామని పేర్కొన్నాడు.
అదే విధంగా, సాయంత్రం సుమారు 5:00 గంటల సమయంలో మరో బొలెరో వాహనం (AP39TN9746) లో మూడు ఎద్దులను (రెండు ఎర్ర, ఒక తెల్ల) మేత, నీరు లేకుండా తరలిస్తున్నప్పుడు పట్టుబడింది. డ్రైవర్ను విచారించగా అతను రాజుపాలెం మద్దిలేటి స్వామి (28), అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం ఉజెర్ల గ్రామానికి చెందినవాడిగా వెల్లడయ్యాడు. ఆయన తెలిపిన ప్రకారం, ఈ ఎద్దులు కర్ణాటకలోని గురుమిత్కాల్ సంతలో రంగన్న అనే వ్యక్తి కొనుగోలు చేసి తన వాహనంలో తరలించే బాధ్యత తనకు అప్పగించాడని చెప్పాడు.
ఈ రెండు సందర్భాల్లో కూడా ఎద్దుల రవాణాకు అవసరమైన వెటర్నరీ డాక్టర్ల అనుమతి పత్రాలు లేకపోవడంతో, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు యజమానులపై కేసులు నమోదు చేసి ఎద్దులను స్థానిక గోశాలకు తరలించారు.
పెబ్బేరు పోలీసులు హెచ్చరికగా పేర్కొన్నది ఏమంటే, వేటర్నరీ అనుమతులు లేకుండా పశువులను రవాణా చేయడం నేరం కావడంతో భవిష్యత్తులో ఇటువంటి చర్యలు తీసుకుంటే కఠినంగా శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేశారు.
