మండలంలో జోరుగా ఫైనాన్స్ దందా

ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారం కట్టడి చేయాలంటూ ప్రజల డిమాండ్
జూలూరుపాడు, ఆగస్టు 30 (Zindagi9News):
మండల పరిధిలో వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ రేట్లతో సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ దందా రోజురోజుకూ పెరిగిపోతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, పేద కుటుంబాలు రుణ బారిన పడుతున్నాయి.
ప్రజల చెబుతున్న వివరాల ప్రకారం, వడ్డీ పేరుతో మూడింతల వడ్డీ రేట్లు వసూలు చేస్తూ, రుణగ్రహీతలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పలువురు రుణభారంతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆరోపిస్తున్నారు. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారం నిషేధించబడినప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.
స్థానికుల మాటల్లో, కొందరు వడ్డీ వ్యాపారులు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నా, అధికారులపై ఎలాంటి చర్యలు లేకపోవడం, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వెంటనే కఠిన చర్యలు తీసుకుని వడ్డీ దందాను ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
