జమ్మికుంటలో కిరాణా షాపులో దొంగతనం
రూ.20 వేలు అపహరణ – కేసు నమోదు

జమ్మికుంట, జూలై 12 (జిందగీ 9 న్యూస్):
పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్‌లోని సంతోషిమాత ఆలయం సమీపంలో ఉన్న మహాలక్ష్మి కిరాణా షాపులో దొంగతనం జరిగింది. రామన్నపల్లి గ్రామానికి చెందిన కొలగాని గణేష్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ షాపును నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో గణేష్ షాపు ఓపెన్ చేయడానికి వెళ్లగా, షట్టర్ ఇప్పటికే ఓపెన్ అయి ఉండటాన్ని గమనించాడు. అనుమానంతో షాపులోకి వెళ్లి పరిశీలించగా, కౌంటర్లో ఉంచిన రూ.20,000 నగదు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు.
తనకు గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి నగదు అపహరించినట్లు గణేష్ అనుమానించి, వెంటనే జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనతో స్థానిక వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి గస్తీ పెంచాలని, పోలీసు భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
