
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో శనివారం రాత్రి దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు జానపద కళాకారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండగా, చిన్న భార్య తిరుమల (28) అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమల గొంతు కోసి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
హత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కావడం విషాదాన్ని నింపింది.
