
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. అవయవ దానంతో మరొకరికి జీవం
హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన బొగ్గుల రాహుల్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సోమాజిగూడలో స్కూటీపై వెళ్తుండగా యూ-టర్న్ తీసుకునే క్రమంలో అదుపుతప్పి కిందపడటంతో తలకు, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ రాహుల్ బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందాడు. మృతుడి అవయవాలను కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ జీవన్‌దాన్ సంస్థకు దానం చేశారు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి బొగ్గుల రాజేశం మాట్లాడుతూ తన కుమారుడు అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణం నిలబెడతాడని తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
