కరీంనగర్ జిల్లాలో దొంగల హల్చల్.. రెండు SBI ఏటీఎంలలో చోరీ

కరీంనగర్, సెప్టెంబర్ 20: కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు, ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుర్షేడు SBI ఏటీఎంలో తెల్లవారుజామున సుమారు 3:35 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. ఏటీఎంలోకి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరాలపై స్ప్రే చేసి, అలారం, కెమెరా కేబుళ్లను కట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ను కట్ చేసి నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ చోరీని దుండగులు సుమారు 8 నిమిషాల్లోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై ఢిల్లీలోని మానిటరింగ్ వ్యవస్థ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తిమ్మాపూర్లోని SBI ఏటీఎంలోనూ చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రెండు ఘటనల్లోనూ ఒకే ముఠా పాల్గొన్నదా లేదా వేర్వేరు ముఠాలు చోరీలకు పాల్పడ్డాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వాహనం కదలికలు, దుండగుల పరారీ మార్గాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే చోరీకి గురైన నగదు మొత్తం ఎంతన్నది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
