
టేకుమట్ల, అక్టోబర్ 8 (Zindagi9news): టేకుమట్ల మండలంలో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలను నియంత్రించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ, ఎమ్మెస్పీ మండల అధ్యక్షులు మాడుగుల వీరయ్య మాదిగ ఆరోపించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు రాం రామచందర్ మాదిగ మాట్లాడుతూ టేకుమట్ల మండల కేంద్రంలో రెండు వైన్ షాపులు ఉండగా, ఒక షాపుకు మాత్రమే సిట్టింగ్ సదుపాయం ఉందని, మరో వైన్ షాప్ నుంచి గ్రామాల్లోని బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో గ్రామంలో ఐదారు వరకు బెల్టు షాపులు నడుస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి కంటే మద్యం సులభంగా లభించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బెల్టు షాపుల కారణంగా యువత మద్యానికి బానిసలవుతున్నారని, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బెల్టు షాపుల నియంత్రణలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలితే సంబంధిత వైన్ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు బెల్టు షాపులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. వైన్ షాపుల వద్ద వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల కోశాధికారి మచ్చ పైడి మాదిగ, మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం శంకర్ మాదిగ, గ్రామశాఖ అధ్యక్షులు మాడుగుల సదానందం, ఎంఆర్పీఎస్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
