జమ్మికుంట మండలం మోత్కులగూడెంలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జమ్మికుంట, సెప్టెంబర్ 27 (Zindagi9News): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెం గ్రామంలో ఓ వ్యక్తి గొంతు కోసుకున్న స్థితిలో కనిపించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మోత్కులగూడెం గ్రామానికి చెందిన బలబద్ర రామారావు (60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బీపీ, షుగర్ సమస్యలతో పాటు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గతంలో రెండు, మూడు సార్లు తనకు జీవితం వద్దంటూ కుటుంబ సభ్యులతో చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామారావు భార్య శివమ్మ సుమారు 13 రోజుల క్రితం తన కుమార్తె ప్రసవం కారణంగా నరసరావుపేటకు వెళ్లింది. రామారావు ఇంట్లోనే ఉన్నాడు. సెప్టెంబర్ 26న మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో రామారావు బాత్రూమ్లో కిందపడిపోగా, పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు గమనించి అతడిని మంచంపై కూర్చోబెట్టినట్లు ఫిర్యాదులో తెలిపారు.
సెప్టెంబర్ 27న ఉదయం సుమారు 6.30 గంటలకు శివమ్మ ఫిర్యాదుదారుడు పొన్నగంటి రాముకు ఫోన్ చేసి తన భర్త మంచంపై పడి ఉండగా రక్తం కారుతోందని చెప్పింది. దీంతో రాము వెంటనే అక్కడికి వెళ్లి చూడగా రామారావు గొంతు కోసుకున్న స్థితిలో కనిపించినట్లు తెలిపాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రామారావు మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, రామారావు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
