
ఇల్లంతకుంటలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఇల్లంతకుంట: రాబోయే శ్రీరామనవమి సందర్భంగా ఇల్లంతకుంట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా, వైభవంగా నిర్వహించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రాద్రి తర్వాత ప్రాధాన్యత కలిగిన ఇల్లంతకుంట దేవాలయంలో జరిగే శ్రీరామ కళ్యాణం ఎంతో అద్భుతంగా జరుగుతుందని, ఈ వేడుకలకు సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, విశ్రాంతి సౌకర్యాలు సమృద్ధిగా కల్పించాలన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే భక్తుల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
వీఐపీలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికతో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు గుర్తించాలని తెలిపారు.
అందరూ కలిసి పనిచేస్తేనే వేడుకలు విజయవంతం అవుతాయని, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, డీసీపీ, ఆలయ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
