
రూ. 3.24 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ – సంక్షేమం, అభివృద్ధికి భారీ కేటాయింపులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల వ్యయంతో వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు. రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి వైపుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ బడ్జెట్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు.
“ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం” అనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బడ్జెట్లో రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పేరుతో ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ప్రతిపాదించారు.
విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టనున్నారు.
• సంక్షేమ పథకాలు – ముఖ్యాంశాలు:
• చేయూత పథకం కింద 2 లక్షల కొత్త పెన్షన్లు
• మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొనసాగింపు
• రూ. 500కే గ్యాస్ సిలిండర్ – 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి
• గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్
• మహిళా శక్తి మిషన్ ద్వారా కోటి మంది మహిళలకు ఆర్థిక శక్తివంతం
—
• వ్యవసాయం & ఆహార భద్రత:
• రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 సహాయం
• సన్నవడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్
• రైతు సంక్షేమానికి రూ. 23,179 కోట్లు
• రేషన్ ద్వారా 3.18 కోట్ల మందికి 6 కిలోల బియ్యం
—
• విద్య & ఉపాధి:
• విద్యా రంగానికి రూ. 26,674 కోట్లు
• 105 రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం
• పాలిటెక్నిక్‌లను ATCలుగా అభివృద్ధి
• శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రూ. 2,000 స్టైపెండ్
—
• ఆరోగ్యం & మౌలిక వసతులు:
• వైద్య రంగానికి రూ. 13,679 కోట్లు
• కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల విస్తరణ
• సాగునీటి ప్రాజెక్టులకు రూ. 22,615 కోట్లు
• రోడ్లు, భవనాలకు రూ. 12,789 కోట్లు
• పట్టణాభివృద్ధికి రూ. 17,907 కోట్లు
—
• ఇతర ముఖ్య అంశాలు:
• ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అభివృద్ధి
• రీజినల్ రింగ్ రోడ్, రైలు ప్రణాళికలు
• 2027 గోదావరి పుష్కరాల కోసం రూ. 500 కోట్లు
• క్రీడలు, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం
