రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
చికిత్స కోసం సోషల్ మీడియాలో వేడుకున్నా ఫలితం లేకపోయింది.. అగ్ర నాయకుల తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి

జమ్మికుంట, మే 14 (Zindagi9News): జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం (46) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సలీం మరణం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న మహమ్మద్ సలీం హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామం నుంచి తన స్వగ్రామమైన ధర్మారం వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, రాజపల్లి–తోకలపల్లి గ్రామాల మధ్య వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలీంను తొలుత హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్లోని అమృత న్యూరో కేర్ సెంటర్కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు.
మహమ్మద్ సలీం కాంగ్రెస్ పార్టీలో దాదాపు 25 ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తూ, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన, రాజకీయ ప్రస్థానంలో ఇతర పార్టీలకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం విశేషం.
సోషల్ మీడియాలో దాతలను వేడుకున్నా స్పందన కరువు
ప్రమాదం తర్వాత సలీం చికిత్స కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా దాతలను, నాయకులను ఆర్థిక సహాయం కోసం వేడుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని కుటుంబ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కోసం పోరాడాల్సి రావడం పట్ల స్థానిక ప్రజలు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అగ్ర నాయకుల తీరుపై కార్యకర్తల్లో అసహనం
సలీం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క అగ్ర నాయకుడు కూడా పరామర్శించలేదని స్థానిక నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, హుజురాబాద్, కమలాపూర్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు “పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నాయకుడిని కూడా పట్టించుకోకపోతే, భవిష్యత్తులో కార్యకర్తల పరిస్థితి ఏమిటి?” అంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
సలీం మరణంతో ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.
