
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మామడ ఎస్ఐ
నిర్మల్, ప్రతినిధి:
కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన మామడ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) టి. అశోక్ గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
బాధితుడిపై వచ్చిన ఒక ఫిర్యాదుకు సంబంధించి, అతడిపై కేసు నమోదు చేయకుండా అధికారికంగా లబ్ధి చేకూర్చడానికి ఎస్ఐ అశోక్ రూ. 20,000/- లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు గురువారం పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఎస్ఐ క్వార్టర్స్‌కు వెళ్లారు. అక్కడ బాధితుడి నుండి లంచం సొమ్ము తీసుకుంటుండగా, ముందస్తు ప్రణాళికతో మాటు వేసిన ఏసీబీ అధికారులు ఎస్ఐను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఐ అశోక్ చేతులకు కెమికల్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ మరియు ఆయన నివాసంలో ఏసీబీ బృందం ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
