శ్రీ సీతారామ దివ్య చరితం – భక్తి పరవశం కలిగించే అపూర్వ పద్యరత్నం
శ్రీ సీతారామ దివ్య చరితం అనే ఈ భక్తి పరవశ పద్యరచనలో శ్రీ సీతారాముల దివ్య దాంపత్య మహిమను అద్భుతంగా చిత్రించారు. రచయిత మంజుల పత్తిపాటి తన కవిత్వంలో భక్తి, భావం, భాషా మాధుర్యాన్ని సమన్వయం చేస్తూ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పాఠకులకు అందించారు.
✨ పద్యరచన:
జనకాత్మజా జానకీ జగదంబ రూపిణి జ్యోతిర్మయి,
శుభలక్షణ శోభితాంగి శశిముఖి శాంతస్వరూపిణి;
రఘువంశ తిలకుడైన రాముని హృదయరత్నమై,
భువనమంత వెలుగొందె భక్తజన పావన సౌభాగ్యము!
మృదుమందహాస విహారిణి మానస సరస్సు కమలమై,
మంగళ గుణగణ గర్భిణి మాతృస్వరూపిణి మాధుర్యమై;
అరణ్యాంతర గాఢవిపినమున అనుబంధమై నిలిచినది,
అనురాగ దీప్తి సాక్షిగా అచంచల సత్యసంకల్పమై!
రామో విగ్రహవాన్ ధర్మో రమణీయ గుణసాగరో,
సీతా సహచర్యమున్ సదా సౌమ్యమూర్తి సుపావనుడు;
సముద్రం సైతం సంభ్రమించు శౌర్య గంభీర వైభవం,
సేతుబంధ కీర్తి సాక్షిగా సాగరమే స్తుతించెను!
విరహాగ్ని వేడిలోనూ విశ్వాస దీప్తి మాయంకాక,
సీతా హృదయం సత్యసింధు స్ఫటికమై నిలిచెను;
రాముని నామస్మరణే రక్షణమై మార్గదర్శిగా,
ధర్మదీపికగా దివ్యదాంపత్య గాథను నిలిపెను!
అశోకవాటికలో ఆర్తిగా నిలిచిన ఆ మంగళ రూపం,
అమృతధారల కన్నీరై ఆకాశమున్ పలికె గాథ;
ఆ దుఃఖ గాఢతను చీల్చి ఆంజనేయుని దర్శనముతో,
ఆశల చిగురులు విరిసె ఆత్మవిశ్వాస సాక్షిగా!
లంకాపురి లయగర్జనలో రామబాణ జ్వాలలతో,
దశముఖ దర్ప దహనమై ధర్మజయం ఘోషించగా;
సీతా రాముల కలయికలో సర్వలోక మంగళ గానం,
సత్యసంధాన సౌభాగ్యమై సకలజన హృదయముల నిండె!
శ్రీరామ సీతల నామమిదే శాశ్వత మంత్రస్వరూపము,
చిత్తశుద్ధి చెలిమెలై చిగురించే చైతన్య దీపము;
భక్తి పరవశ తరంగిణిలో భవసాగరము దాటించు,
పరబ్రహ్మ సాక్షాత్కార పథమిదే పావన సత్యము

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ పద్యరచన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ, ధర్మం, విశ్వాసం, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.
✍️ రచయిత వివరాలు:
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
📞 9347042218
📍 యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
