జమ్మికుంట రైల్వే స్టేషన్లో పోలీసుల ప్రత్యేక తనిఖీలు

జమ్మికుంట, జూన్ 1(Zindagi9news): కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు జమ్మికుంట రైల్వే స్టేషన్లో సోమవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రవి, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం కలిసి రైల్వే స్టేషన్ ప్రాంగణం, ప్లాట్ఫారాలు, ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
రైల్వే మార్గాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా జరిగే అవకాశాల నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. మత్తు పదార్థాల విక్రయం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని, ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
