అంత్య పుష్కరాలను ఏటీఎంగా మార్చుకున్నారు: దుద్దిళ్ల కుటుంబంపై పుట్ట మధూకర్ విమర్శలు

కాళేశ్వరం, జూన్ 1(Zindagi9news): సరస్వతీ అంత్య పుష్కరాలను దుద్దిళ్ల కుటుంబం ఏటీఎంలా ఉపయోగించుకుంటోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. మహదేవ్పూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా పుట్ట మధూకర్–శైలజ దంపతులు పుష్కర స్నానం ఆచరించి, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆది పుష్కరాల్లో అనుసరించిన విధానాన్నే అంత్య పుష్కరాల్లో కూడా కొనసాగిస్తున్నారని విమర్శించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల ఖర్చులపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరినా అధికారులు వెల్లడించడం లేదన్నారు. దేవాదాయ శాఖ ఖర్చుల లెక్కలు కూడా పారదర్శకంగా చెప్పడం లేదని ఆరోపించారు.
మంత్రి సతీమణి శైలజా రామయ్యర్ దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్న సమయంలో పుష్కరాల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు. అంత్య పుష్కరాల కోసం సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ, ఆ నిధులు ఎక్కడ వినియోగించారో స్పష్టత లేదన్నారు.
అంత్య పుష్కరాలకు 40 లక్షల మంది భక్తులు వస్తారని ప్రచారం చేయడంతో చిన్న వ్యాపారులు భారీగా పెట్టుబడులు పెట్టారని, అయితే అంచనాలకు తగ్గట్టుగా భక్తులు రాక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఐదు శాతం కూడా వ్యాపారం జరగలేదని వ్యాపారులు వాపోతున్నారని తెలిపారు.
పుష్కరాల్లో వీఐపీలకు మాత్రమే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, సాధారణ భక్తులు మాత్రం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. మొదటి రోజే మంథని బస్టాండ్లో హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రచార కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, సరస్వతీ అమ్మవారి మండపం పనులు, రహదారి అభివృద్ధి పనులు కూడా పూర్తికాలేదన్నారు. కాళేశ్వరం క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికైనా పారదర్శకత పాటించి, దోపిడీ ఆరోపణలకు తావులేకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దుద్దిళ్ల దంపతులకు పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
