వరంగల్ జిల్లాలో దారుణం: మగబిడ్డ కోసం.. మరో పెళ్లి కోసం భార్య, ఇద్దరు కూతుళ్ల దారుణ హత్య!
- సంచలనం సృష్టించిన పున్నెలు గ్రామం ఉదంతం
- ప్రధాన నిందితుడు సహా 10 మంది అరెస్ట్, ఇద్దరు డాక్టర్లు పరారీ
- వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ

వరంగల్:ఆడపిల్లలకు జన్మనిస్తుందనే నెపంతో, అలాగే మరో మైనర్ బాలికను వివాహం చేసుకోవాలనే దుర్బుద్ధితో కట్టుకున్న భార్యను, ఇద్దరు కన్న కూతుళ్లను నీటిలో ముంచి దారుణంగా హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయారని నిందితుడు నమ్మించే ప్రయత్నం చేయగా, పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేసి ఇది ముమ్మాటికీ పక్కా ప్రణాళికతో జరిగిన హత్యేనని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు.
మగబిడ్డ కోసం పైశాచికం.. లింగ నిర్ధారణ, అబార్షన్లు
ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ఎండీ అజారుద్దీన్(29) అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా(09), ఆయేషా(06) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, నిందితుడి కుటుంబ సభ్యులకు మగబిడ్డ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఈ క్రమంలో 2021, 2022 సంవత్సరాల్లో ఫరహాత్ గర్భం దాల్చగా.. పుట్టబోయేది ఆడపిల్ల అని అనుమానించిన అజారుద్దీన్, తన కుటుంబ సభ్యులు, కొందరు వైద్య సిబ్బంది సహకారంతో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో భార్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు.
మరో పెళ్లి కోసం దారుణ వ్యూహం
ఇదే సమయంలో నిందితుడు తన దూరపు బంధువైన ఒక మైనర్ బాలికపై కన్ను వేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడగా, “నీకు ముందే పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను చేసుకోను” అని ఆ బాలిక తేల్చి చెప్పింది. తన భార్య, పిల్లలు అడ్డుగా ఉన్నందునే ఆమె తనను నిరాకరిస్తుందని అజారుద్దీన్ కక్ష పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఫరహాత్ మళ్లీ గర్భం దాల్చింది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందనే భయంతో కుటుంబ సభ్యులు ఆమెతో గొడవ పడ్డారు. అటు మైనర్ బాలికను పెళ్లి చేసుకోవాలన్నా, ఇటు ఆడపిల్లల బెడద వదిలించుకోవాలన్నా భార్యాపిల్లలను చంపడమే మార్గమని నిందితుడు నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం స్విమ్మింగ్ పూల్‌లో జలసమాధి
తన పథకంలో భాగంగా ఈ నెల 1వ తేదీ రాత్రి 7.50 గంటల సమయంలో ‘ఐస్ క్రీమ్ తినిపిస్తాను’ అని భార్యాపిల్లలను నమ్మించి కారులో తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ముందుగానే అక్కడి సీసీ కెమెరాలు, కరెంటు నిలిపివేశాడు. వారు అక్కడికి చేరుకోగానే బలవంతంగా ముగ్గురినీ నీటిలోకి నెట్టి, వారు చనిపోయేంత వరకు నీటిలో ముంచి పైశాచికంగా హత్య చేశాడు. ఆ తర్వాత వారు ప్రమాదవశాత్తు పడి చనిపోయారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
గుట్టు రట్టు చేసిన పోలీసులు.. డాక్టర్ల అరెస్ట్
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తమకున్న టెక్నాలజీని ఉపయోగించి ఇది హత్యేనని నిర్ధారించారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితులను పట్టుకున్నారు. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన వైద్యులు, సిబ్బందిని కూడా పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
అరెస్టయిన నిందితుల వివరాలు:
- ప్రధాన నిందితుడు: ఎండీ అజారుద్దీన్ (29)
- కుటుంబ సభ్యులు: ఎండీ చాంద్‌పాషా(49), ఎండీ సలీహా(45), ఎం.షరోద్దీన్ (25)
- ఇతర సహకారులు/వైద్య సిబ్బంది:బసిక స్రవంతి (నర్సు), బాల్నె పార్ధు (నెక్కొండ), బొమ్మెర మనోహర్ (ల్యాబ్ టెక్నీషియన్), లింగాల నరేష్ (ఆర్ఎంపీ), సట్ల రాజు (మందుల షాపు నిర్వహణ), వాకుదోట్ భద్రు.
- పరారీలో ఉన్నవారు:డా. బాల్నె పూర్ణిమ, డా. ఎస్. రవళీ.
పట్టుబడిన నిందితుల్లో నర్సు స్రవంతిపై గతంలో మూడు కేసులు, డా. పార్దుపై నాలుగు కేసులు, పరారీలో ఉన్న డా. పూర్ణిమపై నాలుగు కేసులు ఉన్నట్లు సీపీ వెల్లడించారు.
పోలీసు అధికారులకు అభినందనలు
ఈ సంక్లిష్టమైన కేసును త్వరగా పరిష్కరించి, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, గీసుగొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, మామూనూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మరియు ఎస్ఐలు శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు హేమకుమార్, శ్రీనివాస్‌లను సీపీ అభినందించారు.
