
కరీంనగర్/నిజామాబాద్, మే 12: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి గంగాధర ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌ను లంచం కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ (SRO)గా విధులు నిర్వహిస్తున్న మందా కిరణ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో పెద్దపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో కిరణ్ కుమార్ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 2025 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దరఖాస్తుదారుల నుంచి సుమారు రూ.1,06,500 లంచం స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నగదును తన ప్రైవేట్ అసిస్టెంట్ బిట్టు అలియాస్ రత్న కుమార్ ద్వారా UPI చెల్లింపుల రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో మంగళవారం (మే 12) నిజామాబాద్‌లోని కిరణ్ కుమార్ నివాసంలో దాడులు నిర్వహించిన అధికారులు, ఆయనను అరెస్ట్ చేశారు.
అనంతరం కిరణ్ కుమార్‌ను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
